గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో జవాన్ ను చంపేశారు. తన కూతురు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని ప్రశ్నించినందుకు గానూ జవాన్‌ను చంపేశారు. జవాన్ భార్య, కుమారుడిపై కూడా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. బీఎస్ఎఫ్ జవాన్ మేలాజీ వాఘేలా(42) తన ఉద్యోగానికి సెలవు పెట్టి ఇటీవలే ఇంటికి వచ్చాడు. తన కూతురు(మైనర్)ను అసభ్యకరంగా చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జవాన్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో ఆ వీడియోలను వైరల్ చేసిన దినేష్ జాదవ్ ఇంటికి వెళ్లాడు. వీడియోలను ఎందుకు వైరల్ చేస్తున్నారని, తక్షణమే తొలగించాలని జాదవ్ కుమారుడిని జవాన్ వాఘేలా హెచ్చరించాడు. ఈ క్రమంలో వాఘేలాపై జాదవ్ కుమారుడితో పాటు మరో ఆరుగురు కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో వాఘేలా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ వీడియోను 15 ఏళ్ల శైలేష్ జాదవ్ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు, అతను అమ్మాయితో సన్నిహితంగా మెలిగాడు. నిందితుడు, బాలిక ఒకే పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు. వాఘేలాను చంపిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారని నదియాడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వీఆర్ బాజ్‌పాయ్ ఏఎన్‌ఐకి తెలిపారు. సెలవులో ఉన్న వాఘేలా డిసెంబర్ 24న గుజరాత్‌లో హత్యకు గురయ్యారని BSF ధృవీకరించింది, రాష్ట్ర పోలీసులు వేగంగా వ్యవహరించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారని ప్రకటన వచ్చింది. BSF దళం అతని కుటుంబానికి న్యాయం జరిగేలా చేయడానికి అన్ని విధాలుగా సహకారం అందించనుందని తెలిపింది.