ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేసి బిల్లు చెల్లించకుండా వెళ్లిపోతున్న 65 ఏళ్ల వ్యక్తిని ఆదివారం కొల్లాం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుకున్నారు. అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. విన్సెంట్ జాన్ పై ఓ స్టార్ హోటల్ ఇటీవలే ఫిర్యాదు చేసింది.. దీంతో అధికారులు అతడిని అరెస్టు చేశారు. అతను అక్కడే ఉండి బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన జాన్ అనే వ్యక్తి హోటల్ లో ల్యాప్‌టాప్‌ను దొంగిలించాడని కూడా గుర్తించారు. కొల్లాంలోని ఒక దుకాణం నుండి దానిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. అతని శైలి, ప్రవర్తించిన తీరును దృష్టిలో ఉంచుకుని హోటల్ అతని నుండి ముందస్తుగా నగదు తీసుకోలేదని పోలీసులు తెలిపారు.
జాన్ హోటల్ సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టాడు. అతను వెళ్తూ.. వెళ్తూ.. తిరిగి వస్తానని చెప్పాడని. అతను తిరిగి వచ్చే సమయానికి 100 మందికి విందు ఏర్పాటు చేయమని చెప్పాడని హోటల్ సిబ్బంది చెప్పారు. కేరళతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవాలో గతంలో ఇలా చాలాసార్లు మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అతడు చాలా నేరాలు చేశాడని.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా సమాచారం వస్తోందని అధికారులు తెలిపారు. హోటల్‌లోని సిసిటివి ఫుటేజీ, అతని మొబైల్ నంబర్, అతడి ఫోటోను ఉపయోగించి అతడు కొల్లాంకు వెళ్లినట్లు గుర్తించినట్లు అధికారి తెలిపారు. కొల్లాం పోలీసుల సహాయంతో కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బృందం అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.