స్కూల్ కు తుపాకీ తీసుకెళ్లి కాల్పులు జరిపిన‌ నర్సరీ విద్యార్థి

బీహార్‌లో ఓ ఐదేళ్ల బాలుడు తుపాకీ తీసుకొచ్చి మరో విద్యార్థిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

By Medi Samrat  Published on  31 July 2024 6:32 PM IST
స్కూల్ కు తుపాకీ తీసుకెళ్లి కాల్పులు జరిపిన‌ నర్సరీ విద్యార్థి

బీహార్‌లో ఓ ఐదేళ్ల బాలుడు తుపాకీ తీసుకొచ్చి మరో విద్యార్థిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. బీహార్‌లోని సుపాల్ జిల్లాలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సరీ విద్యార్థి అయిన బాలుడు తన స్కూల్ బ్యాగ్‌లో తుపాకీని దాచుకుని పాఠశాలకు వెళ్లాడు. ఆ తర్వాత 9 ఏళ్ల బాలుడిపై కాల్పులు జరపడంతో అతని చేతికి గాయమైంది. కాల్పులకు గురైన విద్యార్థి 3వ తరగతి చదువుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

"నేను నా క్లాస్ క్లాస్ కు వెళుతున్నప్పుడు అతను తన బ్యాగ్ నుండి తుపాకీని తీసి నాపై కాల్చాడు. నేను అతనిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, అతను కాల్పులు జరిపాడు," అని ఆసుపత్రి బెడ్‌పై పడి ఉన్న బాలుడు చెప్పాడు. ఆ అబ్బాయితో తనకు ఎలాంటి గొడవలు లేవని కూడా చెప్పాడు. స్కూల్ ప్రిన్సిపాల్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిర్లక్ష్యం ఎలా జరిగిందంటూ ప్రశ్నిస్తున్నారు. కాల్పులు జరిపిన విద్యార్థి, అతని తండ్రి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల బ్యాగులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు పోలీసు ఉన్నతాధికారులు సూచనలు జారీ చేశారు.

Next Story