రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును పోలీసు వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీసులు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సుజన్‌గఢ్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగిందని చురు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ నాయక్ తెలిపారు.
మరణించిన పోలీసులు ఎన్నికల సమావేశానికి హాజరయ్యేందుకు తారానగర్‌కు వెళ్తున్నారని.. ఆ సమయంలోనే అనుకొని ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మృతి చెందిన పోలీసులను ఖిన్వ్‌సర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ రామచంద్ర, కానిస్టేబుల్ కుంభారం, సురేష్ మీనా, తానారామ్, మహేంద్రగా గుర్తించారు.
ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.