ఇల్లు విడిచి పారిపోయిందని చెప్తున్నారు.. కానీ జ‌రిగింది వేరు..

భార్యను హత్య చేసి శవాన్ని ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టిన వ్యక్తిని మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on  2 Feb 2025 12:39 PM IST
ఇల్లు విడిచి పారిపోయిందని చెప్తున్నారు.. కానీ జ‌రిగింది వేరు..

భార్యను హత్య చేసి శవాన్ని ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టిన వ్యక్తిని మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులతో పాటు సిగ్నల్ కాలనీకి చెందిన కాటి గోపి (29), అతని తల్లిదండ్రులు కాటి రాములు (66), కాటి లక్ష్మి (56), అతని సోదరి హెచ్చు దుర్గ (28), బావమరిది హెచ్చు మహేందర్ (31)లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో వాంటెడ్ గా ఉన్న ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన బత్తుల వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

నాగమణి అనే మహిళ ఇటీవలి కాలంలో కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశం నుంచి దుర్వాసన కూడా రావడంతో ఆమెను హత్య చేశారని తెలుసుకున్నారు.

భవన నిర్మాణ కార్మికుడు కాటి గోపి పని నిమిత్తం ఏలూరు వెళ్లి అక్కడ నాగమణిని కలిశాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆమె భర్త మరణించాడు. ఆమెను పెళ్లి చేసుకొని మహబూబాబాద్‌లోని తన ఇంటికి తీసుకొచ్చాడు. నాగమణిని గోపీ పెళ్లి చేసుకోవడం కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. దీంతో గత నెల16న గోపీతో పాటు అతని తల్లిదండ్రులు, సోదరి దుర్గ, మహేందర్ దంపతులు కలిసి నాగమణిని ఇంట్లో కొట్టి చంపారు. అనంతరం ఇంటి ముందు బొంద తీసి డెడ్ బాడీని పాతిపెట్టారు. కొద్ది రోజులుగా నాగమణి కనిపించకపోవ‌డంతో కాలనీవాసులు అడిగారు. సంక్రాంతి రోజు ఇల్లు విడిచిపెట్టి పారిపోయిందని చెప్పారు. చివరికి పోలీసులకు సమాచారం చేరడంతో హత్యోదంతం బయటపడింది.

Next Story