నలుగురు కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్య
నైరుతి ఢిల్లీలోని రంగపురి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తమ అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారని పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 28 Sep 2024 5:00 AM GMTనైరుతి ఢిల్లీలోని రంగపురి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తమ అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తి, అతని నలుగురు కుమార్తెలు విషపూరిత పదార్థం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని గమనించిన ఇరుగుపొరుగు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించాం అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఓ గదిలో తండ్రి మృతదేహం కనుగొన్నాం, మిగిలిన గదుల్లోకి వెళ్ళినప్పుడు, మేము అతని నలుగురు కుమార్తెల మృతదేహాలను కూడా కనుగొన్నామని వివరించారు. తండ్రే కూతుళ్లకు విషం తినిపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురు కుమార్తెలు శారీరక వైకల్యంతో ఉన్నారని పోలీసులు తెలిపారు. 8 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లని గుర్తించారు. కొన్నేళ్ల క్రితం కేన్సర్‌తో ఆడపిల్లల తల్లి చనిపోయిందని స్థానికులు పోలీసులకు తెలిపారు. తండ్రి కార్పెంటర్‌గా పనిచేసేవాడు.
ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. తన కుమార్తెలందరినీ తండ్రి ఒక్కడే చూసుకునేవాడని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు. గదుల్లోని ఆహార శాంపిల్స్, మందు రేపర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ కుటుంబం ఎనిమిదేళ్లుగా రంగపురిలోని భవనంలోని నాలుగో అంతస్తులో నివసిస్తోంది. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాలను శవపరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు.