ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

4 killed in road accident in Alluri district. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున

By Medi Samrat  Published on  13 Jun 2022 12:53 PM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలోని చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. సంగీత ట్రావెల్స్‌కు చెందిన బస్సు 60 మంది ప్రయాణికులతో పొరుగున ఉన్న ఒడిశాలోని చిన్నపల్లి నుంచి విజయవాడకు వెళ్తోంది. మూల మ‌లుపు వద్ద ట‌ర్న్ తీసుకుంటున్న‌ సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాటసారుల ద్వారా అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు పొరుగున ఉన్న తెలంగాణలోని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. మృతుల్లో ముగ్గురిని ధనేశ్వర్ దళపతి (24), జీతు హరిజన్ (5), నునేన హరిజన్ (2)గా గుర్తించారు. బాధితులంతా ఒడిశాకు చెందిన వారు, కూలీ పనుల కోసం విజయవాడకు వెళ్తున్నారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంతో వాహనం నడిపాడని ప్ర‌యాణికులు అంటున్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.











Next Story