జంతువులకు ఆహారం పెడుతోందని మహిళా వెటర్నరీ డాక్టర్ తలపై బాదడంతో..

33-year-old veterinarian gets beaten up for feeding crows. నగరంలో పశువులకు ఆహారం పెడుతున్న వారిపై వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయి.

By Medi Samrat  Published on  12 April 2022 10:54 AM GMT
జంతువులకు ఆహారం పెడుతోందని మహిళా వెటర్నరీ డాక్టర్ తలపై బాదడంతో..

ముంబై : నగరంలో పశువులకు ఆహారం పెడుతున్న వారిపై వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయి. శుక్రవారం సొసైటీ ఆవరణలో జంతువులు మరియు పక్షులకు ఆహారం ఇవ్వడంతో మహిళను తల్లీ కొడుకులు కలిసి కొట్టారు. బాధితురాలు 33 ఏళ్ల మహిళా వెటర్నరీ డాక్టర్‌. నిందితులు ఆమెను చెట్టు కొమ్మలతో కొట్టారని, దీంతో ఆమె పుర్రెపై పగుళ్లు, ఇతర గాయాలయ్యాయి. అగ్రిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు కానీ నిందితులను పట్టుకోలేకపోయారు.

బాధితురాలు మాన్సీ మెహతా అగ్రిపాడలోని శాంతి నగర్‌లో నివాసం ఉంటోంది. 20 సంవత్సరాలుగా వారి అపార్ట్‌మెంట్‌లో పెంపుడు జంతువులకు చికిత్స చేస్తోంది. ఘటన అనంతరం ఆమెను బీవైఎల్ నాయర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ వైద్యుడి వద్ద చికిత్స పొందుతోంది. నిందితులైన అర్చనా రామ్‌కుమార్ గుప్తా (42), ఆమె కుమారుడు పార్థ్ రామ్‌కుమార్ గుప్తా (19) కూడా గత రెండేళ్లుగా ఇదే సొసైటీలో నివసిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మెహతా తల్లి నీతా కాకులకు తిండి తినిపిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అర్చన గుప్తా పక్షులకు ఆహారం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవకు దారితీసింది. మెహతా మాట్లాడుతూ "అర్చనా గుప్తా వచ్చి నా తల్లిని దుర్భాషలాడడం ప్రారంభించింది. ఆమె కొడుకు పార్త్ కూడా చేరి నా తల్లిని కొట్టాడు. నేను వెంటనే వెళ్లి మా అమ్మను రక్షించడానికి వారిని తోసాను. కానీ వారు నన్ను కొట్టడం ప్రారంభించారు. వారు కొన్ని చెట్ల కొమ్మలను తీసుకొని నా తలపై రెండుసార్లు కొట్టారు. చుట్టుపక్కల వ్యక్తులు మాకు సహాయం చేయడానికి వచ్చారు. నాయర్ హాస్పిటల్‌లోని డాక్టర్ నాకు ఎక్స్-రే తీసుకోమని సలహా ఇచ్చారు, నా తలపై ఫ్రాక్చర్ అయిందని చూపించింది. ప్రైవేట్ డాక్టర్ దగ్గర ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాను'' అని చెప్పింది.

మెహతా మాట్లాడుతూ "నేను వెటర్నరీ డాక్టర్. నేను నా నివాసంలో జంతువులకు చికిత్స చేస్తున్నాను. 20 సంవత్సరాలకు పైగా ఆ ప్రాంతంలోని జంతువులకు ఆహారం ఇస్తున్నాను. నిందితుల కుటుంబం రెండేళ్ల క్రితం మా సొసైటీకి మారి అప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే ఉంది" అని తెలిపింది. జస్ట్ స్మైల్ ఛారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్న స్నేహ విసారియాకు ఈ సంఘటన గురించి తెలియజేసి, ఆమె సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది మెహతా. "పక్షులతో సహా జంతువులకు ఆహారం ఇవ్వడం ప్రతి పౌరుడి హక్కు. ఇది నేరం కాదు. వేసవిలో చాలా పక్షులు ఆహారం మరియు నీటి కొరత కారణంగా చనిపోతాయి. మనమందరం వారికి ఆహారం ఇవ్వాలి. " అని జంతు ప్రేమికులు తెలిపారు. సీనియర్ ఇన్‌స్పెక్టర్ యోగేంద్ర పాచే మాట్లాడుతూ, "ఆమెను కొట్టినందుకు అర్చన గుప్తా, ఆమె కుమారుడు పార్త్ గుప్తాపై మేము కేసు నమోదు చేసాము. ఈ ఘటనపై విచారణ ప్రారంభించి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం. ఈ కేసులో మేము ఇంకా అరెస్టు చేయవలసి ఉంది." అని అన్నారు.
















Next Story