Maternity Shoot : ప్రసూతి ఫోటోషూట్‌లో తీవ్ర విషాదం..!
బెంగళూరు శివార్లలోని ఒక స్టూడియోలోని కొలనులో శనివారం మూడేళ్ల బాలుడు మునిగి చనిపోయాడు.
By - Medi Samrat |
బెంగళూరు శివార్లలోని ఒక స్టూడియోలోని కొలనులో శనివారం మూడేళ్ల బాలుడు మునిగి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనాయకనహళ్లి సమీపంలోని గిడ్డెనహళ్లిలోని ది షైర్ స్టూడియోలో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరులోని అమృతహళ్లికి చెందిన స్వాతి తన స్నేహితురాలి ప్రసూతి షూట్(Maternity Photoshoot) కోసం స్టూడియోకి వెళ్లి తన కుమారుడిని కోల్పోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వాతి తన స్నేహితురాలి ఫోటోషూట్‌కు హాజరవగా.. ఆ బాలుడు స్టూడియోలో తిరుగుతున్నాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత తన బిడ్డ కనిపించకపోవడంతో స్వాతి తన కొడుకు కనిపించడం లేదని గ్రహించి, అతని కోసం వెతకడం ప్రారంభించింది. తరువాత కొన్ని నిమిషాలకు స్టూడియో లోపల ఉన్న కొలనులో అతడి మృతదేహం కనిపించింది. ఆ కొలనును కేవలం ఫోటోషూట్ కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. ఘటనకు ముందు తల్లి కానీ, అక్కడున్న సిబ్బంది కానీ ఆ బిడ్డను గమనించలేదు. తరువాత బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
స్వాతి భర్త చరణ్ రాజ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. పని నిమిత్తం అమెరికాలో ఉన్నాడు. "స్వాతి షాక్‌లో ఉంది. తన కొడుకు చనిపోయాడనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. తదుపరి ప్రక్రియకై భర్త రాక కోసం మేము ఎదురు చూస్తున్నాము" అని పోలీసు అధికారి తెలిపారు. స్వాతి తండ్రి రమేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాదనాయకనహళ్లి పోలీసులు అసహజ మరణ నివేదిక (UDR) కింద కేసు నమోదు చేశారు.