రాంచీలోని రణదీహ్ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలను కిరాతకంగా చంపేశారు. ఆ మహిళలు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్థులు కొట్టి చంపారు. రైలు దేవి (45), ఢోలీ దేవి (60), అలోమణి దేవి అనే మహిళలను చంపేశారు. ఆ మహిళలను చంపడంలో సదరు మహిళ కుమారుడు, భర్త కూడా పాల్గొన్నారు. రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, మూడో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గ్రామం మంత్రగత్తెలచే శపించబడిందనే ప్రచారం విపరీతంగా జరగడంతో మహిళలను చంపేశారు. ఇటీవల రాజ్‌కిషోర్ ముండా అనే బాలుడు పాము కాటుకు గురయ్యాడు. ఒక భూతవైద్యుడు అతన్ని తిరిగి బ్రతికించడానికి ప్రయత్నించాడు.. కానీ అందులో అతడు విఫలమయ్యాడు. ఆ తరువాత, ఆ గ్రామాన్ని ఎవరో మంత్రగత్తెలు శపించారని అతను చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇటీవల మరో చిన్నారి పాము కాటుకు గురైన ఘటన చోటుచేసుకుంది. ఈసారి గ్రామస్తులు చికిత్స అందించి బాలుడిని కాపాడారు. బాలుడి మృతికి మంత్రగత్తెల ప్రమేయం ఉందనే అనుమానంతో గ్రామస్థులు మహిళలను కర్రలతో కొట్టి చంపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోగా స్థానికులు వారిని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు గ్రామస్తులను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా వారు సమాధానం చెప్పలేదు. దర్యాప్తులో భాగంగా సోనాహటు పోలీస్ స్టేషన్ సమీపంలోని రణదీహ్ గ్రామ సమీపంలోని అడవిలో రెండు మృతదేహాలను కనుగొన్నారు. మూడో మృతదేహం కోసం గాలిస్తున్నారు. తదుపరి విచారణ కోసం పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.