ఏపీలో బస్సు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
ఏపీలోని నంద్యాల జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది.
By - Medi Samrat |
ఏపీలోని నంద్యాల జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట సమీపంలో తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు, కంటైనర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. 36 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ARBCVR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పగిలిపోవడంతో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది.
టైరు పగలడంతో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయి అదుపు తప్పి డివైడర్‌కు అడ్డంగా పడి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రభావంతో భారీగా మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. మృతుల్లో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, లారీ క్లీనర్ మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. అయితే మంటలు ఎగిసిపడుతున్న సమయంలో అటుగా వెళ్తున్న డీసీఎం వాహన డ్రైవర్ వెంటనే స్పందించాడు. తన వాహనాన్ని ఆపి, బస్సు అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు రావాలని సూచించాడు. దీంతో ప్రయాణికులు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే కిటికీల నుంచి దూకే క్రమంలో పదిమందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంటలు తీవ్రతరం కావడంతో లారీ కూడా పూర్తిగా కాలిపోయింది.
మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో బస్సు, లారీ క్షణాల్లో దగ్ఘమయ్యాయి. ప్రయాణీకుల లగేజీ చూస్తుండగానే కాలి బూడిదయ్యింది.. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
,