లోయలో పడిన బస్సు.. 25 మంది మృతి
25 killed as bus with Yamunotri pilgrims falls in Uttarakhand gorge. ఉత్తరాఖండ్‌లోని దమ్టాలో యమునోత్రి జాతీయ రహదారి సమీపంలో ఆదివారం
By Medi Samrat Published on 6 Jun 2022 8:39 AM IST
ఉత్తరాఖండ్‌లోని దమ్టాలో యమునోత్రి జాతీయ రహదారి సమీపంలో ఆదివారం 28 మంది యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 25 మంది మరణించారు. బస్సు యమునోత్రి వైపు వెళుతోంది. బస్సులో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.
యాత్రికుల మృతి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. "ఉత్తరాఖండ్‌లో భక్తుల బస్సు లోయలో పడిపోవడం చాలా బాధాకరం. దీనిపై నేను ముఖ్యమంత్రి పుష్కర్ ధామితో మాట్లాడాను. స్థానిక అధికారులు, SDRF బృందాలు రెస్క్యూ పనిలో నిమగ్నమై ఉన్నాయి. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. NDRF కూడా వెంటనే అక్కడికి చేరుకుంటుందని ట్వీట్ చేశారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. పుష్కర్ ధామీ ట్వీట్ చేస్తూ.. "ఉత్తరకాశీలోని పురోలాలోని దమ్టా సమీపంలో ప్రయాణీకుల బస్సు ప్రమాదం గురించి దురదృష్టకర వార్త అందింది. సమాచారం అందిన వెంటనే, సత్వర సహాయక చర్యల కోసం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాం. ప్రమాదంపై దర్యాప్తు చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాము. భగవంతుడు మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలి. మృతుల కుటుంబ సభ్యులకు ఈ బాధను భరించే శక్తిని ప్రసాదించాలి. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాసుకొచ్చారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు లక్ష రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.