యువ ఫోటోగ్రాఫర్ దారుణ హత్య
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 3 March 2024 4:15 PM ISTడా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రావులపాలెంలో యువ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పోతిన సాయికుమార్ (23) హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లిళ్లకు ఆన్‌లైన్ బుకింగ్‌లు తీసుకునే సాయికుమార్‌కు ఫిబ్రవరి 26న రావులపాలెంలో ఇద్దరు ఖాతాదారుల నుంచి ప్రోగ్రాం ఆఫర్ రావడంతో.. షూట్ గురించి తల్లిదండ్రులకు తెలియజేసి సామగ్రితో బయలుదేరాడు. అయితే.. రాజమండ్రి చేరుకోగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని తీసుకెళ్లినట్లు సమాచారం.
దీంతో కొడుకు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన సాయికుమార్ తల్లిదండ్రులు రావులపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కాల్ డేటా రికార్డుల ద్వారా హంతకులను గుర్తించి.. ఒక నిందితుడు షణ్ముఖ తేజను అరెస్టు చేశామని.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ హత్యకు కారణం దోపిడీ ఉద్దేశమే ప్రధాన లక్ష్యంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సాయికుమార్ వద్ద ఉన్న అత్యాధునిక ఫోటోగ్రఫీ పరికరాల విలువ రూ. 15 లక్షలు ఉంటుందని అంచనా. వాటిని దక్కించుకునేందుకే దుండగులు అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.