5.29 కోట్ల విలువైన సైబర్ మోసానికి పాల్పడిన 23 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఐదు రాష్ట్రాలకు చెందినవారు. వీరిపై భారతీయ న్యాయ సంహితలోని (BNS) 111(2)(బి), 308(2), 318(4), 319(2), 336(3), 338, 340(2) సెక్షన్లు, IT చట్టంలోని 66 C, 66 D IT చట్టం సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు.
ఈ నేరాలు ఉద్యోగాల పేరుతో మోసం, డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ మోసానికి సంబంధించినవి. నిందితుల నుంచి 40 వేల నగదు, 25 మొబైల్ ఫోన్లు, 45 సిమ్ కార్డులు, 28 పాస్‌బుక్‌లు, 23 డెబిట్, క్రెడిట్ కార్డులు, ఒక ల్యాప్‌టాప్, మూడు క్యూఆర్ కోడ్‌లు, 5 స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ పోలీసు సైబర్ క్రైమ్ విభాగాలు ఐదు రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలతో సమన్వయం చేసుకుని నిర్దిష్ట నిఘా ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించాయి. అరెస్టుల అనంతరం మూడు కేసుల్లోని బాధితులకు రూ.39 లక్షలు వాపసు చేశారు. ఈ నేరస్థులపై దేశవ్యాప్తంగా 328 కేసులు నమోదవడం విశేషం. వీరి అరెస్ట్ పై సైబర్ క్రైమ్ డీసీపీ కవిత మాట్లాడుతూ.. మొత్తం ఐదు ప్రత్యేక బృందాలు గాలించి, నేరగాలను అరెస్టు చేసినట్లు, ఐదు రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామన్నారు.