పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో బస్సు లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనలో 22 మంది మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సుధోంటి జిల్లా బలోచ్ ఏరియా నుండి రావల్పిండి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు నుంచి 500 మీటర్ల లోతులో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.
రోడ్డు పక్కనే ఓ వ్యాపారి ప్రమాదాన్ని చూశాడు. వెంటనే ఓ మత పెద్దకు సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని ఓ దిన పత్రిక తెలిపింది. మసీదులోని మైకులో జరిగిన ప్రమాదం గురించి తెలిపిన మత పెద్ద.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కోరినట్లు పత్రిక పేర్కొంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ పూర్తిగా ప్రమాదకరమైన రోడ్లతో కూడిన ప్రాంతం. ఏ మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన రోడ్డు ప్రమాదం జరగడం ఖాయం. ఇక్కడ చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. జరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో కూడా పీవోకేలోని పూంచ్, నీలమ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. 32 మంది గాయపడ్డారు.