ఉత్తరప్రదేశ్ లో 22 మంది మృతి
22 dead in rain-related incidents in UP. ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాలలో
By Medi Samrat Published on 17 Sept 2022 5:03 PM ISTఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాలలో వర్షాలకు కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాల్లో శనివారం మరింత వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో కురిసిన భారీ వర్షానికి దిల్‌కుషా ప్రాంతంలో గోడకూలి తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. దిల్‌కుషా ప్రాంతంలోని మిలటరీ ప్రహరీ గోడ వెంబడి కొందరు గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. గురువారం రోజంతా కురిసిన వానకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ గోడ కూలిపోయింది. దీంతో గుడిసెల్లో నిద్రిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు అని అధికారులు చెప్పారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించారు. మృతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఆర్థికసాయం ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక ఉన్నావ్ (ఐదు), ఫతేపూర్ (మూడు), ప్రయాగ్‌రాజ్ (ఇద్దరు), సీతాపూర్, రాయ్‌బరేలీ మరియు ఝాన్సీ (ఒక్కొక్కటి) 13 మంది మరణించినట్లు అధికారులు వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. గురువారం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోభారీ వర్షాలు నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాష్ట్రంలో శుక్రవారం 32.2 మిమీ సగటు వర్షపాతం నమోదైంది.