ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య
21 Year old Lady found dead in a Suspicious way in Adilabad. తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 27 May 2022 7:27 PM ISTతెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండలో రాజేశ్వరి అనే యువతిని ఆమె తల్లిదండ్రులే కత్తితో గొంతు కోసి మరీ దారుణంగా హత్య చేశారు. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందన్న కారణంగానే ఆమెను తల్లిదండ్రులు చంపేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం నాగల్ కొండలో కూతురిని గొంతు కోసి చంపాడు ఓ తండ్రి. నాగల కొండ గ్రామానికి చెందిన పవార్ రాజేశ్వరి(21) మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన షేక్ అలీం అనే యువకుడిని మతాంతర వివాహం చేసుకుంది. రెండు వారాల క్రితం గ్రామంలో పంచాయితీ పెట్టి రాజేశ్వరిని, షేక్ అలీంను విడదీస్తూ గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు.
తనకు భర్తే కావాలంటూ ఉదయం తండ్రి పవార్ దేవిదాస్ తో ఈరోజు గొడవకు దిగింది. తమ కుటుంబ పరువు తీశావంటూ ఆగ్రహించిన దేవిదాస్.. నడి రోడ్డుపై కూతురు గొంతు కోసి హత్య చేశాడు. తల్లి పవార్ సావిత్రి బాయి ఎదుటే కన్నబిడ్డను కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు నిర్ధారించుకున్నారు. మొదట పోలీసులకు ఫోన్ చేసిన పవార్.. తన కూతురును ఎవరో చంపేశారంటూ సమాచారం ఇచ్చాడు. అలా పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల విచారణలో తండ్రి దేవిదాసే హత్య చేసినట్లుగా గుర్తించారు.
తెలంగాణ పరిధిలో ఇప్పటికే రెండు పరువు హత్యలు చోటుచేసుకున్నాయి. నాగరాజు అనే యువకుడిని, నీరజ్ పన్వార్ అనే యువకుడి హత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే..!