వ్యాన్ లోతైన గుంతలో పడి 20 మంది కూలీలు మృతి.. 30 మందికి గాయాలు

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వ్యాను కాలువలో పడి 20 మంది చనిపోయారు.

By Medi Samrat
Published on : 22 April 2025 4:18 PM IST

వ్యాన్ లోతైన గుంతలో పడి 20 మంది కూలీలు మృతి.. 30 మందికి గాయాలు

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వ్యాను లోయలో పడి 20 మంది చనిపోయారు. అదే సమయంలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వ్యాన్ అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. దంషోరో జిల్లాలోని కొండ ప్రాంతాల గుండా వ్యాన్ వెళుతోంది. వ్యాన్ వేగం చాలా ఎక్కువగా ఉండడంతో వ్యాన్ బ్యాలెన్స్ తప్పి లోతైన గుంతలో పడిపోయింది.

మూలాల ప్రకారం.. ఈ వ్యాన్‌లో కొల్హి తెగ ప్రజలు ఉన్నారు. వ్యాన్ పంజాబ్‌లోని లాపరి నుంచి సింధ్‌లోని బాదిన్‌కు వెళ్తోంది. అతివేగం కారణంగా వ్యాను లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీమ్‌ గాయపడిన వారందరినీ కాలువలో నుంచి బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై డిప్యూటీ కమిషనర్ గజన్‌ఫర్ ఖాద్రీ మాట్లాడుతూ.. వ్యాన్‌లో చాలా మంది కూలీలు ఉన్నారని తెలిపారు. ఈ కూలీలందరూ గోధుమలు కోయడానికి బలూచిస్థాన్‌కు వెళ్లి పని ముగించుకుని ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా మార్గమధ్యంలో వ్యాన్ ప్రమాదానికి గురైందని తెలిపారు.

రెస్క్యూ టీమ్ ప్రకారం.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన పలువురి పరిస్థితి చాలా విషమంగా ఉంది. క్షతగాత్రులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పాకిస్థాన్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. అధ్వాన్నమైన రోడ్లు, పాత వాహనాలు, వేగంగా నడపడం వల్ల పాకిస్థాన్‌లో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అత్యంత అధ్వాన్నమైన ట్రాఫిక్ వ్యవస్థ ఉన్న దేశాలలో పాకిస్తాన్ పేరు ముందు వ‌రుస‌లో ఉంది.

Next Story