ఈ టీచర్లు మామూలోళ్లు కాదు..!
'బ్రేకింగ్ బాడ్' అనే పాపులర్ సిరీస్ తరహాలో ఇద్దరు టీచర్లు సొంతంగా డ్రగ్స్ ను తయారు చేయడం మొదలుపెట్టారు.
By Medi Samrat
'బ్రేకింగ్ బాడ్' అనే పాపులర్ సిరీస్ తరహాలో ఇద్దరు టీచర్లు సొంతంగా డ్రగ్స్ ను తయారు చేయడం మొదలుపెట్టారు. రాజస్థాన్‌లో రూ. 15 కోట్ల విలువైన మెఫెడ్రోన్ (4-మిథైల్మెథ్‌కాథినోన్) డ్రగ్‌ను తయారు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్, కోచింగ్ సెంటర్‌లో ఫిజిక్స్ టీచర్‌ను అరెస్టు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) తెలిపింది.
గంగాసాగర్ జిల్లాలోని ముక్లావాలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌లో సైన్స్ టీచర్ మనోజ్ భార్గవ్ (25), రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఇంద్రజీత్ విష్ణోయ్ లు గత రెండున్నర నెలలుగా శ్రీ గంగానగర్ ప్రాంతంలోని రిద్ధి-సిద్ధి ఎన్‌క్లేవ్‌లోని డ్రీమ్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని తయారీ చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ నుండి రసాయనాలు, పరికరాలను కొనుగోలు చేసి మెఫెడ్రోన్ డ్రగ్ తయారు చేస్తున్నారు. ఇక ఈ పని చేయడానికి ఉద్యోగాల నుండి సెలవు కూడా తీసుకుంటున్నారని NCB డైరెక్టర్ (జోధ్‌పూర్ జోనల్ యూనిట్) ఘనశ్యామ్ సోని తెలిపారు.
గత రెండున్నర నెలల్లో, వీరిద్దరూ దాదాపు ఐదు కిలోగ్రాముల డ్రగ్‌ను తయారు చేశారు. దీని విలువ మార్కెట్లో దాదాపు 15 కోట్లు. ఇందులో వారు 4.22 కిలోల డ్రగ్‌లను విక్రయించారని సోని చెప్పారు. ఫ్లాట్ మీద జరిపిన దాడిలో 780 గ్రాముల MD డ్రగ్, పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ ధర రూ. 2.34 కోట్లుగా అంచనా వేశారు. అంతేకాకుండా, అసిటోన్, బెంజీన్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, బ్రోమిన్, మిథైలమైన్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్, 4-మిథైల్ ప్రొపియోఫెనోన్, n-మిథైల్-2-పైరోలిడోన్ వంటి రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.