ఢిల్లీలోని బేగంపూర్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఓ ఇల్లు కూలిపోవడంతో పెను ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖకు ఈ సంఘటన గురించి తెల్లవారుజామున 4:15 గంటలకు సమాచారం అందింది. తో ఆ ఇంట్లో నివసిస్తున్న నలుగురు శిథిలాల కింద చిక్కుకున్నారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపారు. అనంతరం అగ్నిమాపక శాఖ నాలుగు వాహనాలను ఘటనా స్థలానికి పంపించి సహాయక చర్యలు చేపట్టారు. అయితే వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినప్పటికీ, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అదే సమయంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా అగ్నిమాపక శాఖ, ఢిల్లీ పోలీసులు ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో విజయం సాధించారు.
అదే సమయంలో ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని అంబేద్కర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలో అగ్నిమాపక శాఖతో పాటు, ఢిల్లీ పోలీసులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు. గతంలో ఢిల్లీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. నంద్‌నగరి ప్రాంతంలో గతంలో రెండతస్తుల భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే సబ్జిమండి ప్రాంతంలో కూడా నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్పకులిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.