ఒడిశాలోని జగత్సింగ్‌పూర్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు సోదరులు సామూహిక అత్యాచారం చేసి, ఆమె ఐదు నెలల గర్భవతిగా ఉందని తెలిసి ఆమెను సజీవంగా పాతిపెట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. బనాష్‌బారా గ్రామానికి చెందిన భాగ్యధర్ దాస్, పంచనన్ దాస్ అనే ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. మూడవ నిందితుడు తుళు ఆచూకీ ఇంకా లభించలేదు. అతని కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
సమీపంలోని ఒక మఠంలో పనిచేసే నిందితులు మైనర్‌పై చాలా కాలం పాటు అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఆమె గర్భవతి అని తెలుసుకున్న వారు ఆమెను సజీవంగా పాతిపెట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. నిందితులు గర్భస్రావం కోసం డబ్బు చెల్లించడానికి ముందుకొచ్చారు. వారు బాధితురాలిని ఒక ప్రదేశానికి పిలిపించగా, ఆమె అందుకు అంగీకరించింది. అక్కడికి చేరుకుని ఓ గుంత ఉందని ఆమె గుర్తించింది. గర్భస్రావం చేయించుకోకపోతే.. సజీవంగా అందులో పాతిపెడతామని నిందితులు ఆమెను బెదిరించడం ప్రారంభించారు.
బాధితురాలు నిందితుల నుండి తప్పించుకుని తన తండ్రికి జరిగిన విషయాన్ని వివరించింది. ఆమెకు జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె తండ్రి కుజాంగ్ పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఇద్దరు అనుమానితులను కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతోంది.