సెంట్రల్ ఆఫ్రికా దేశమైన ఈక్వటోరియల్ గినియాను భారీ పేలుళ్లు అతలాకుతలం చేశాయి. ఆ దేశపు అతిపెద్ద నగరమైన బాటాలోని ఒక సైనిక స్థావరం వద్ద ఆదివారం జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో 17 మంది మరణించగా.. 400 మందికి పైగా గాయపడ్డారు. సైనిక స్థావరం వద్ద డైనమైట్ వాడకానికి సంబంధించిన నిర్లక్ష్యం వల్ల పేలుళ్లు సంభవించాయని అధ్యక్షుడు టియోడోరో ఒబియాంగ్‌ను పేర్కొన్నారు.
పేలుడు ప్రాంతంలోని సమీప ఇళ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి జనాలు భయంతో పరుగులు తీశారు. సహాయక బృందాలు శిథిలాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గాయపడ్డవారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరందరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల అర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అహకారాలతో నిండిపోయింది.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఇదిలావుంటే.. ఈక్వటోరియల్ గినియా 1.4 మిలియన్ల జనాభా కలిగిన చిన్న దేశం. ఒక్క బాటాలోనే 8 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. దేశంలో చమురు నిల్వలు అధికంగా ఉన్నా.. పేదరికంలో జీవిస్తోంది.