జూలై 31న లక్నోలోని గోమతి నగర్‌లోని నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో బైక్‌పై వెనుక కూర్చుని వెళుతున్న మహిళను కొంతమంది వ్యక్తులు పట్టుకుని వేధించారు. దీంతో పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా ఎనిమిది మంది అధికారులపై చర్యలు తీసుకుంది పోలీసు యంత్రాంగం. స్థానిక పోలీస్ స్టేషన్ ఇంఛార్జితో సహా ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయగా, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్ లక్నో), అదనపు డీసీపీ, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా వారిని కూడా విధుల నుండి తొలగించినట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
బుధవారం (జూలై 31) గోమతి నగర్ ప్రాంతంలోని తాజ్ హోటల్‌కు సమీపంలోని అండర్‌పాస్ సమీపంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో.. నీటిలో మునిగిన రహదారి గుండా వెళుతున్న వాళ్లపై కొందరు వ్యక్తులు నీటిని చిమ్ముతూ ఉన్నారు. ఓ మోటారుసైకిల్‌పై కూడా నీటిని కొట్టారు. ఆ మహిళ బైక్ వెనుక కూర్చొంది. ఇంతలో మరికొందరు మోటార్‌సైకిల్‌ను చుట్టుముట్టారు. కొందరు దానిని వెనుక నుండి లాగడం ప్రారంభించారు. మోటారుసైకిల్ నడుపుతున్న వ్యక్తి వారిని వారించడానికి ప్రయత్నిస్తుండగా, నిందితులు వెనుక ఉన్న స్త్రీని పట్టుకున్నారు. మహిళ కింద పడగానే ఆ వ్యక్తులు మోటార్‌సైకిల్‌ను లాగడం మానేశారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ వైరల్ అవ్వడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అల్లరి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ రావడంతో పోలీసు ఉన్నతాధికారులు యాక్షన్ లోకి దిగారు. వీడియోల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.