స్నాక్స్ కోసం బయటకు వెళ్లిన 15 ఏళ్ల బాలిక.. శవంగా..

15-year-old girl went outside to get snacks, found dead. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావాలో 15 ఏళ్ల మైనర్ బాలికను హత్య చేసిన ఘటన

By Medi Samrat  Published on  13 Nov 2021 2:11 PM GMT
స్నాక్స్ కోసం బయటకు వెళ్లిన 15 ఏళ్ల బాలిక.. శవంగా..

ఇటావా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావాలో 15 ఏళ్ల మైనర్ బాలికను హత్య చేసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో చిరుతిళ్లు కొనేందుకు బాలిక బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుండి బాలిక ఇంటికి తిరిగి రాలేదు.. కుటుంబ సభ్యులు ఆమెను కనుగొనడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో విషయం పోలీసులకు తెలిపారు. రెండు రోజుల తర్వాత బాలిక మృతదేహం కాలువలో పడి ఉండడాన్ని గుర్తించారు. బాలిక మెడకు నైలాన్ తాడు బిగించి ఉంది. పోలీసులు ఆమె ఆచూకీ కనుక్కునే విషయంలో నిర్లక్ష్యం వహించారని విమర్శలు వస్తున్నాయి. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే తమ కూతురు బతికి ఉండేదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సీసీటీవీ ఫుటేజీతో పాటు సాంకేతిక సహాయంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

బాలిక మిస్సింగ్‌పై బుధవారం ఫిర్యాదు అందినట్లు ఎస్‌ఎస్‌పీ జై ప్రకాష్‌సింగ్‌ తెలిపారు. బాలిక మృతదేహం శుక్రవారం కాలువలో పడి ఉంది. మృతదేహం మెడకు నైలాన్ తాడు బిగించి ఉండడంతో కేసు దర్యాప్తు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. బాలిక వయస్సు 15 సంవత్సరాలు మాత్రమేనని.. 9వ తరగతి చదువుతోందని కుటుంబ సభ్యులు వాపోయారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు దుకాణానికి వెళ్లి చిరుతిళ్లు తీసుకు వస్తానని చెప్పిందని.. ఆ తర్వాత తిరిగి రాలేదని మృతురాలి తల్లి తెలిపింది. సాయంత్రం పోలీసులకు సమాచారం ఇచ్చినా పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదని.. గురువారం కూడా పోలీసులను ఆశ్రయించినా ఏమీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేదని అన్నారు.


Next Story