తమిళనాడులోని రాణిపేటలో 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని అద్విత మంగళవారం నాడు క్లాస్‌లో స్పృహతప్పి పడిపోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న అద్విత తరగతికి హాజరవుతుండగా కుప్పకూలిపోయింది. క్లాస్‌మేట్ భుజంపై కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్లుగా కనిపించింది. ఆ తర్వాత అక్కడికక్కడే కుప్పకూలింది. ఉపాధ్యాయులు వెంటనే ఆమెను మెల్విషారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు చనిపోయిందని ప్రకటించారు.
అమ్మాయి వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో డెర్మటాలజీ విభాగాధిపతి డాక్టర్ కె. వసంతకుమార్ కుమార్తె అని తేలింది. విద్యార్థిని గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.కావేరిపాక్కం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వేలూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
క్లాస్‌రూమ్‌లోని సిసిటివి ఫుటేజీ మొత్తం సంఘటనను క్యాప్చర్ చేసింది. అద్విత పక్కనే ఉన్న అమ్మాయి భుజంపై పడిపోవడంతో ఆమె క్లాస్‌మేట్ టీచర్‌ను అలర్ట్ చేసింది. ఉపాధ్యాయురాలు, ఇతర విద్యార్థిని ఆమెకు సహాయం చేయడానికి పరుగెత్తడం సీసీటీవీలో రికార్డు అయింది.