గ్రామస్థుడి కస్టడీ మరణంపై ఆగ్రహించిన బృందం పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. ఒక పోలీసు కానిస్టేబుల్‌ను చంపిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. పశ్చిమ చంపారన్ జిల్లాలో పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి మరణించాడు. దీంతో ఆగ్రహించిన సంబంధికులు శనివారం బల్తార్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో 14 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.బల్తార్ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశాం. మిగిలిన నిందితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని చంపారన్ రేంజ్ డీఐజీ ప్రణవ్ కుమార్ ప్రవీణ్ తెలిపారు.
శనివారం ఆర్యనగర్ నివాసి అనిరుద్ధ్ కుమార్ అలియాస్ అమృత్ యాదవ్ కస్టడీ మరణం గురించి సమాచారం అందడంతో వందలాది మంది గ్రామస్తులు బల్తార్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసు కానిస్టేబుల్ మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. మరణించిన కానిస్టేబుల్‌ను రామ్ జతన్ రాయ్‌గా గుర్తించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు అమృత్ యాదవ్‌ను బల్తార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే.. తన సోదరుడిని పోలీసులు కొట్టి చంపారని మృతుడి సోదరుడు కన్హయ్య యాదవ్ ఆరోపించారు.
అయితే.. అమృత్ యాదవ్ మరణించే సమయంలో పోలీసు కస్టడీలో లేడని పోలీసులు తెలిపారు. "అతను మా కస్టడీలో లేడు. పోలీసు లాకప్‌లో ఉంచబడ్డాడు. అయితే.. అతను పోలీస్ స్టేషన్ ఆవరణలో హ్యాండ్ పంప్‌ని ఉపయోగించి నీరు తాగుతున్నప్పుడు తేనెటీగల గుంపు అతనిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. అయితే.. ఆగ్రహించిన గ్రామస్తులు మూడు పోలీసు వాహనాలు, ఒక అగ్నిమాపక దళం, రెండు ప్రైవేట్ వాహనాలతో సహా ఆరు వాహనాలకు నిప్పుపెట్టారని పోలీసులు తెలిపారు.