ఒక చేతిలో ఫోన్, 120 కి.మీ వేగంతో కారు డ్రైవింగ్.. ఇద్దరి మృతి
గుజరాత్‌లోని రాజ్‌కోట్-పోర్‌బందర్ హైవేపై మితిమీరిన వేగం, సోషల్ మీడియా పిచ్చి ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది.
By - Medi Samrat |
గుజరాత్‌లోని రాజ్‌కోట్-పోర్‌బందర్ హైవేపై మితిమీరిన వేగం, సోషల్ మీడియా పిచ్చి ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. జెట్‌పూర్ సమీపంలో 120 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
రాజ్‌కోట్-పోర్‌బందర్ జాతీయ రహదారిపై జెట్‌పూర్ సమీపంలోని పెడ్ల చౌకడి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 'అప్లై ఫర్ రిజిస్ట్రేషన్' బోర్డు ఉన్న సరికొత్త నలుపు రంగు హ్యుందాయ్ వెర్నా కారులో ముగ్గురు యువకులు జెట్‌పూర్ నుండి ధోరాజీ వైపుకు అతి వేగంగా వెళ్తున్నారు. ప్రమాదం జరగడానికి సరిగ్గా కొద్ది నిమిషాల ముందు, కారును 120-125 కి.మీల వేగంతో నడుపుతూ, డ్రైవింగ్ చేస్తున్న యువకుడు ఒక చేతితో మొబైల్ ఫోన్ పట్టుకుని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చిత్రీకరించాడు. ఓ పాటను కూడా ఈ వీడియోకు జతచేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే కారు డ్రైవర్ స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. కారు అదుపుతప్పి డివైడర్‌ను, ఆ తర్వాత పక్కనే ఉన్న గోడను అత్యంత బలంగా ఢీకొట్టింది. వేగానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు స్నేహితుల్లో అవధ్ తివారీ (20) అనే యువకుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, దేవరాజ్ గోసాయ్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో యువకుడు అక్షయ్ వాఘేలా పరిస్థితి విషమంగా ఉండటంతో అతనికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన అవధ్ తివారీపై గతంలో దాడి, కిడ్నాప్ కింద పలు తీవ్రమైన క్రిమినల్ కేసులు పోలీసు రికార్డులలో నమోదై ఉన్నాయి.