తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో 12 మందిని అరెస్టు చేశారు, వారిలో సగం మంది మైనర్లు ఉండడం షాకింగ్ గా అనిపిస్తోంది. బాలిక కడుపు నొప్పిగా ఉందని ఆమె తల్లికి చెప్పడంతో చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆ తర్వాత లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా ఆమె గర్భవతి అని వైద్యులు గుర్తించారు. ఆసుపత్రి పల్లవరం పోలీసులకు సమాచారం అందించగా, వారు విచారణ ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఒకరు చెన్నైలోని పల్లవరం ప్రాంతంలో ఆమె తల్లిదండ్రులు పనిలో ఉన్నప్పుడు తన ఇంట్లో ఒంటరిగా ఉండే బాలికతో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తరువాత అతను తన స్నేహితులను కూడా తీసుకువచ్చాడు, వారు కూడా ఆమెపై దాడి చేశారు. పోలీసుల దర్యాప్తు తర్వాత, డిక్సన్, సంజయ్, అజయ్, సూర్య, నందకుమార్, ఎస్ సంజయ్ అనే ఆరుగురు పురుషులను, ఆరుగురు మైనర్లను లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద అరెస్టు చేశారు. వారిని తాంబరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పురుషులను పుళల్ జైలుకు, మైనర్లను బాలల నిర్బంధ కేంద్రానికి తరలించారు.