కడపలో అగాడి వీధిలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు బాలురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు విద్యార్థులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్కూల్ నుంచి మధ్యాహ్నం సైకిల్‌పై ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
కడప అగాడి వీధిలో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి తన్వీర్(11) అనే చిన్నారి మృతి చెందిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విద్యుదాఘాతంతో గాయపడిన మరో విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాను. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ట్వీట్ చేశారు.