బిహార్‌లోని హాజీపూర్‌లో బుధవారం నాడు పదేళ్ల బాలికకు కొందరు వ్యక్తులు నిప్పంటించిన సంఘటన సంచలనంగా మారింది. బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. హాజీపూర్‌లోని బహురా గ్రామంలో ఓ వివాహ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన అమ్మాయిలతో కొందరు అబ్బాయిలు బలవంతంగా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించగా, బాలికలు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఇద్దరు అబ్బాయిలు బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
ఆరవ తరగతి చదువుతున్న బాధితురాలు మాట్లాడుతూ.. "రోషన్ భయ్యా పెళ్లి కోసం బిలోకి వెళ్ళాము. మేము అక్కడ డ్యాన్స్ చేస్తున్నప్పుడు, కొందరు వచ్చి మాతో కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. పెళ్లి విందు ముగించుకుని వస్తుండగా గొడవ జరిగింది. తమను వెళ్లనివ్వబోమని అబ్బాయిలు బెదిరించారు. అప్పుడు నేను అరవడం మొదలుపెట్టగానే అందరూ వచ్చారు. అప్పుడు మమ్మల్ని విడిచిపెట్టారు. రాత్రి సమయంలో అమ్మమ్మ దగ్గర పడుకున్నాను.. మరుసటి రోజు ఉదయం బాత్‌రూమ్‌కి వెళ్లే సమయంలో కొందరు నా నోరు మూసేసి కొంచెం దూరం తీసుకెళ్లారు. నాపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు." అని తెలిపింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.