చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకువెళ్లిన బస్సు.. పలువురు దుర్మరణం
10 Killed as bus plunges into gorge in Bhakarapeta Ghat.చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి
By తోట వంశీ కుమార్
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ వద్ద ఓ ప్రైవేటు బస్సు సుమారు 100 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో 50 మందికిపైగా తీవ్రగాయాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ధర్మవరంలోని మారుతినగర్‌కు చెందిన పట్టు చీరల వ్యాపారి మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు కు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేణు కుటుంబం ధర్మవరం నుంచి శనివారం మధ్యాహ్నం 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరారు.
పీలేరులో రాత్రి 8 గంటల సమయంలో ఓ దాబా వద్ద ఆగి అందరూ భోజనం చేశారు. అనంతరం తమ ప్రయాణాన్ని ప్రారంభిన కొద్ది సేపటికే బాకరాపేట ఘాట్‌లో వస్తుండగా దొనకోటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపులో ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్ల మలుపు వద్ద బస్సు అదుపు తప్పి కుడివైపున ఉన్న సుమారు 100 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు పది మంది వరకు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
రాత్రి 9.30గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చుట్టూ చిమ్మ చీకటి, ముళ్ల పొదలు, బండరాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియక బస్సులోకి వాడు హడలిపోయారు. బస్సు పల్టీలు కొట్టడంతో ఒకరిపై మరొకరు పడి కాళ్లు, చేతులు విరగడం. తలకు గాయాలై ఆ ప్రాంతమంత రక్తమయమైంది. రాత్రి పూట ప్రమాదం జరగడంతో చాలా సేపటి వరకు ఈ విషయం వెలుగులోకి రాలేదు. వారి ఆర్తనాదాలు విన్న వాహనదారులు లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. లోయలోంచి క్షతగాత్రులను పైకి తీసుకువచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలా మంది తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.