శివానీ వివాహం ఇంకో 10 రోజుల్లో జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు కూడా ముద్రించారు. బంధువులను కూడా ఆహ్వానించారు. అయితే శివానీ తల్లి అనిత తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కు గురి చేసింది. ఆమె తల్లి శివానీకి కాబోయే వరుడితో పారిపోయింది.
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని మద్రక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వధువు తల్లి ఇలాంటి పని చేసింది. ఇంట్లో ఉన్న రూ.3.5 లక్షలకు పైగా నగదు, రూ.5 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను కూడా తీసుకెళ్లింది. ఏప్రిల్ 16న రాహుల్‌ను వివాహం చేసుకోవాల్సి ఉండగా, నా తల్లి అతనితో పారిపోయిందని శివానీ వాపోయింది. రాహుల్, నా తల్లి గత మూడు నుండి నాలుగు నెలలుగా ఫోన్‌లో చాలాసేపు మాట్లాడుకునేవారని తెలిపింది.
శివాని తండ్రి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ, తాను బెంగళూరులో ఒక వ్యాపారం నిర్వహిస్తున్నానని తన భార్య అనిత కాబోయే అల్లుడితో గంటల తరబడి మాట్లాడుతూ ఉండేదని తనకు కూడా తెలుసన్నారు. కానీ వివాహం త్వరలో జరగనున్నందున ఏమీ చెప్పకూడదని నిర్ణయించుకున్నానని అన్నారు. ఇప్పుడు తన భార్య కోసం మిస్సింగ్ కంప్లైంట్ ను దాఖలు చేశాడు.