ఓ నాయకుడి మరణం.. 10 మంది అమాయకుల సజీవ దహనం
10 burnt alive by mob after murder of panchayat leader in Birbhum. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో సోమవారం ఒక గుంపు కొందరి ఇళ్లకు నిప్పుపెట్టడంతో
By Medi Samrat
పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో సోమవారం ఒక గుంపు కొందరి ఇళ్లకు నిప్పుపెట్టడంతో 10 మందికి పైగా సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బీర్‌భూమ్‌లో పంచాయతీ నాయకుడిగా పనిచేసిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడి హత్య జరిగిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. రాంపూర్‌హాట్ పట్టణం శివార్లలో ఉన్న బొగ్టుయ్ గ్రామంలోకి చొరబడ్డ తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన గుంపు గత రాత్రి 10 నుండి 12 ఇళ్లకు నిప్పుపెట్టింది. ఇప్పటి వరకు మొత్తం 10 మృతదేహాలను వెలికి తీయగా, వాటిలో ఏడు కాలిపోయిన మృతదేహాలను ఒకే ఇంటి నుంచి వెలికితీసినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ధృవీకరించారు.
బర్షల్ గ్రామానికి చెందిన టీఎంసీ నాయకుడు భాదు షేక్ మృతదేహం సోమవారం ప్రాంతంలో లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోంది. అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య పోటాపోటీగా గొడవలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఈ ఘటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ ట్వీట్ చేశారు. "అగ్ని ప్రమాదంలో స్థానికులు మరణించడం బాధాకరం. అయితే ఈ ఘటనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు. ఇది స్థానిక గ్రామ వివాదం. హత్యకు గురైన పంచాయితీ డిప్యూటీ చీఫ్ ప్రముఖ వ్యక్తి అతని మరణం గ్రామస్తులకు కోపం తెప్పించింది, ఇది హింసాత్మక నిరసనకు దారితీసింది. అగ్నిప్రమాదం రాత్రి సమయంలో జరిగింది, అయితే పోలీసులు మరియు అగ్నిమాపక దళం తక్షణమే చర్యలు తీసుకుంది" అని కునాల్ ఘోష్ బెంగాలీలో ఒక ట్వీట్‌లో తెలిపారు. బదు షేక్ సోదరుడు బాబర్ షేక్ ఏడాది క్రితం ఇదే గ్రామంలో కాల్చి చంపబడ్డాడని బీర్భూమ్ జిల్లా పోలీసు అధికారి తెలిపారు.