ఇక్కడ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. అక్కడ మరో దారుణం..!

By అంజి  Published on  6 Dec 2019 12:10 PM IST
ఇక్కడ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. అక్కడ మరో దారుణం..!

యూపీలో ఘోరం జరిగింది. తమ దుర్మార్గాలని బయటపెట్టిందన్న అక్కసుతో అత్యాచార బాధితురాలిని ఐదుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర షాక్‌కు గురైనప్పటికీ ఆ యువతి ధైర్యం కోల్పోలేదు. శరీరమంతా మంటలు వ్యాపిస్తున్నా ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించింది. అంతేకాదు 112 నెంబర్ కూడా ఫోన్ చేసి తన పరిస్థితి వివరించింది. తక్షణమే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే ఆమె శరీరం 90% కాలిపోయింది. కళ్ళు మూతలు పడుతూ, శరీరం సహకరించని, మాట రాని పరిస్థితిలో కూడా ఆమె వాంగ్మూలం ఇచ్చింది. తనపై దాడి చేసింది ఎవరు ఎందుకు చేశారు అన్న అంశాలను వివరించింది. వీటి ఆధారంగానే ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్నావ్ రేప్ బాధితురాలిపై దాడి చేసిన ఐదుగురిని హరిశంకర్ త్రివేది, రామ్ కిషోర్ త్రివేది, ఉమేష్ బాజ్‌పాయ్, శివమ్, శుభమ్ త్రివేదిగా గుర్తించారు. వీరిలో శివమ్, శుభమ్ త్రివేది ఈ కేసులో ప్రధాన నిందితులు. వారిలో ఒకరు బెయిల్‌పై ఇటీవల బయటకు వచ్చి మళ్లీ బాధితురాలిపై దాడికి ఒడిగట్టారు.

అసలేం జరిగిందంటే..

మార్చిలో ఇద్దరు వ్యక్తులపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. అదంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదవగా.. ప్రస్తుతం రాయ్‌బరేలీ కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరో నిందితుడిని మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఇదే క్రమంలో గురువారం ఆమె కోర్టు విచారణకు బయలుదేరింది. అదే అదనుగా భావించిన నిందితులు గ్రామ శివారుల్లో మరో ముగ్గురితో కలిసి ఆమెను అడ్డగించి పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాధితురాలని తొలుత ఉన్నావ్ ఆస్పత్రికి తర్వాత లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో ఆమెను ఎయిర్ అంబులెన్సులో ఢిల్లీలోని సఫర్గంజ్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. కేసుపై త్వరిత విచారణకు ఆదేశించారు.

Next Story