ముఖ్యాంశాలు

  • క్రైమ్ సీన్ అనాలసిస్ కోసం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు
  • పారిపోయే ప్రయత్నం చేసిన నిందితులు
  • పారిపోయే ప్రయత్నంలో పోలీసులపై కాల్పులు
  • పోలీసుల ఎదురుకాల్పుల్లో ఘటనాస్థలంలోనే మరణించిన నలుగురు నిందితులు

హైదరాబాద్ : వెటర్నటీ డాక్టర్ దిశ హత్యకేసు కొత్తమలుపు తిరిగింది. ఆమె ఆత్మకు సత్వరన్యాయం జరిగింది. సైబరాబాద్ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని క్రైమ్ సీన్ లో నలుగురు నిందితుల్నీ శుక్రవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చేశారు. మరిన్ని వివరాలు సేకరించడంకోసం నిందితుల్ని పోలీసులు క్రైమ్ సీన్ కి తీసుకెళ్లిన సందర్భంలో పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మరక్షణ కోసం గత్యంతరం లేని పరిస్థితిలో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నలుగురు నిందితులూ మరణించారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఆయన అన్నారు.

మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు క్రైమ్ స్పాట్ లోనే ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఔటర్ రింగ్ రోడ్ మీద టైర్ పంచర్ కావడంతో తన స్కూటీని నిలిపిన వెటర్నరీ డాక్టర్ దిశను ట్రాప్ చేసి అత్యంత దారుణంగా మానభంగం చేసి, ఆమెను బతికి ఉండగానే తగలబెట్టిన, అత్యంత క్రూరస్వభావం కలిగిన నిందితులకు సరైన శిక్ష పడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

క్రైమ్ సీన్ ని ఎనలైజ్ చేసేందుకు పోలీసులు నిందితుల్ని గురువారం అర్థరాత్రి, శుక్రవారం తెల్లవారు జామున ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో కాల్పులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఆత్మ రక్షణకోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీస్ వర్గాలు తెలిపాయి. నిందితుల్ని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు వాళ్లకు రిమాండ్ విధించింది. నిందితులను ప్రశ్నించి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు న్యాయస్థానాన్ని కస్టడీకోసం అభ్యర్థించిన విషయం తెలిసిందే. పోలీస్ కస్టడీనుంచి నిందితులను క్రైమ్ సీన్ అనాలసిస్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

విషయం తెలుసుకున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఘటనా స్థలానికి హుటాహుటిన వెళ్లారు. వెటర్నరీ డాక్టర్ దిశ గ్యాంగ్ రేప్ ఉదంతం దేశ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. నిందితులను ఉరితీయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా సామాన్యులు, మహిళా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు నిరసనలు తెలిపాయి. పార్లమెంట్ లో ఎం.పి జయాబచ్చన్, నిందుతులను కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరిన విషయం తెలిసిందే. దిశకు న్యాయం చేయాలని కోరుతూ దేశ రాజధానిలో, తెలంగాణ రాజధానిలో నిరసన వెల్లువెత్తింది.

చివరకు ఎన్‌కౌంటర్‌..

తెలంగాణ పోలీసులు ఈ ఘటనపై విచారణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇంత ఘోరం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఘటనా స్థలానికి కూడా రాలేదంటూ ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఈ దశలో దిశను నిందితులు ఏ స్థలంలో ఘోరంగా గ్యాంగ్ రేప్ చేసి నిట్టనిలువునా ప్రాణాలు తీశారో, సరిగ్గా అదే ఘటనా స్థలంలో వాళ్లుకూడా పోలీస్ కాల్పుల్లో మరణించడం విశేషం. దిశ తల్లిదండ్రులుకూడా తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి సత్వర న్యాయం జరగాలంటూ విలపించారు. అనేకమైన కీలక మలుపులు తిరిగిన ఈ కేసు దర్యాప్తు చివరకు నిందితుల ఎన్ కౌంటర్ తో ముగిసింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.