ఢిల్లీ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహాం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2020 3:19 PM IST
ఢిల్లీ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహాం..

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు 10వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక దేశరాజధాని ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని సుప్రీం కోర్టు తెలిపింది. కరోనా రోగులకు చికిత్స, అంత్యక్రియల నిర్వహణ తీరుపై శుక్రవారం సుప్రీం కోర్టు సుమోటోగా విచారణ జరిపింది. ఆస్పత్రుల్లో కరోనా మృతదేహాల నిర్వహాణ సరిగా లేదని, కరోనా పేషంట్లని పశువుల కంటే హీనంగా చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేసింది. మృతదేహాలు చెత్త కుప్పల్లో కనిపిస్తున్నాయని మండిపడింది. మృతదేహాల ఉంచడంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఢిల్లీలో కరోనా పరీక్షలు తగ్గడంపైనా ప్రశ్నించింది. కరోనా ప్రారంభమైనప్పుడు పరీక్షలు చేయడంతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉందని, కాని.. ఇప్పుడు క్రమంగా ఎందుకు కిందకు పడిపోయిందని ప్రశ్నించింది. గతంలో రోజుకు 7 వేలకు పైగా టెస్టులు చేస్తే.. ఇప్పుడు 5 వేలు కూడా లేదంది. కేసుల సంఖ్య పెరిగితే.. టెస్టుల సంఖ్య పెరగాలని సూచించింది. ఆస్పత్రిలో బెడ్‌లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని మీడియాలో కథనాలు వస్తుంటే.. ప్రభుత్వం మాత్రం ఖాళీ బెడ్‌లు ఉన్నాయని చెప్పడం పై ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఇప్పటి వరకు 34వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1,085 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story