టెస్టులు టెస్టులే.. కేసులు కేసులే..! రెండింటి మధ్య తేడా చాలా

By మధుసూదనరావు రామదుర్గం  Published on  27 July 2020 6:07 PM IST
టెస్టులు టెస్టులే.. కేసులు కేసులే..! రెండింటి మధ్య తేడా చాలా

పరీక్షల వల్లే కేసులు హెచ్చు కాలేదు

దేశంలో ఈ ర్యాపిడ్‌ టెస్టులు చేపట్టడం వల్లనే కేసులు అధిక సంఖ్యలో బైటపడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వాదన సరికాదు. టెస్టుల సంఖ్యతో సరిసమానంగా కేసులు నమోదు కావడం లేదు. అంతకన్నా అధికంగానే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా పాజిటివ్‌గా నమోదవుతున్న కేసుల సంఖ్యకు రావచ్చని అనుకుంటున్న సంఖ్యకు మధ్య 9 శాతం తేడా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌నే తీసుకుంటే.. గత నెలరోజులగా టెస్ట్‌ చేసిన కేసులతో నమోదైనవి సమానంగా ఉండి ఉంటే, జులై 25 నాటికి పాజిటివ్‌ కేసులు రమారమి 56వేల పైచిలుకు ఉండేది. కానీ వాస్తవం వేరుగా కనిపిస్తోంది. కేసులు 86వేల పైచిలుకు నమోదయ్యాయి. అంటే అనుకున్న దానికంటే 60 శాతం హెచ్చుగా అన్నమాట. కర్ణాటకలోనూ పరిస్థితి ఇలానే ఉంది. అనుకున్న దానికంటే హెచ్చు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో 13 పెద్ద రాష్ట్రాల్లో అనుకున్న దానికంటే అధికకేసులు నమోదవుతూ ప్రజల కంటిపై కునుకు రాకుండా చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో చేపట్టిన టెస్టుల ఆధారంగా అనుకున్న దానికంటే 10 శాతం అధికంగా కేసులు వస్తున్నాయి. వీటలో ఏడు రాష్ట్రాల పరిస్థితి మరింత దయనీయం అనుకున్న దానికంటే 20శాతం హెచ్చుగా ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలే కాకుండా పశ్చిమబెంగాల్, కేరళ, జార్కండ్‌ఒడిశా, బిహార్‌ రాష్ట్రాల్లోనూ కేసుల పెరుగుదల ఇదే రీతిలో ఉంటున్నాయి.

అస్సాం, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌ ఘర్, జమ్ము కశ్మీర్,పంజాబ్‌లలో టెస్ట్‌ చేసిన వారి సంఖ్య కంటే 10–20శాతం అధికంగా కేసులు ఉంటున్నాయి. ఉత్తరప్రదేశ్,రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కూడా ఊహించిన దానికంటే అధికంగా కేసులు నమోదవడం గమనించ దగ్గ విషయం. కాబట్టి టెస్టులకు వాస్తవ కేసుల సంఖ్య పెరుగుదలకు మధ్య తేడా ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది.

మొత్తమ్మీద దేశం కోవిడ్‌–19 ధాటికి విలవిల్లాడుతోంది. రోజురోజుకూ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. కరోనా ఎప్పుడు వదులుతుందా అనుకునే వారు ఈ కేసుల్ని చూసి ఠారెత్తిపోతున్నారు. దేశంలో కమ్యూనిటీ వ్యాప్తి మొదలైందని చాలా రాష్ట్రాలు చెబుతున్నాయి. మార్చి నెలకు ఇప్పటికీ పోల్చి చూస్తే కేసుల ఉధృతి ఏంటో మనకు అర్థమవుతుంది. మొదట్లో రాష్ట్రాల్లో రోజుకు 100 దాకా కరోనా పాజిటివ్‌ కేసులు వస్తుంటే ఇప్పడు అవి వేలల్లో ఉన్నాయి. ఒకవైపు వాక్సిన్‌ ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోంది అన్న వార్తలు వినవస్తున్నా.. అది వచ్చేలోగా ఈ పాడు కరోనా ఎందరినీ కమ్మేస్తుందోనని హడలి చస్తున్నారు.

Next Story