ఏపీలో కరోనా పరీక్షలకు ధరల నిర్ణయం.. కొత్త ధరలివే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2020 10:45 AM GMT
ఏపీలో కరోనా పరీక్షలకు ధరల నిర్ణయం.. కొత్త ధరలివే

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల ధరలను నిర్ణయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి పంపే శాంపిళ్లు, ప్రైవేట్‌ ల్యాబ్‌లు సొంతంగా సేకరించే శాంపిళ్లకు ఈ ధరలు వర్తిస్తాయి. ప్రైవేట్ ఆస్పత్రుల ల్యాబ్‌లలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలకు రూ.750 కంటే ఎక్కువ వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

ఆర్టీపీసీఆర్ విధానంలో చేసే పరీక్షకు రూ.2,800 ధరను నిర్ణయించారు. ర్యాపిడ్ కిట్, పీపీఈ కిట్లు, మానవ వనరుల వ్యయం అన్నీ కలుపుకునే ఈ ధరను నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రభుత్వంతో పాటు ఐసీఎంఆర్ కు కూడా పరీక్షల ఫలితాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పద్ధతిలో, ఈ ధరలతో కరోనా పరీక్షలు చేయదలుచుకున్న ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్ లు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్ లు జనాన్ని దోచుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇచ్చింది. వీటిని ప్రైవేటు ల్యాబ్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే వాటి లైసెన్స్ ల రద్దుతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Next Story
Share it