భక్తుల దర్శనార్థం కొండపై టిటిడి తీసుకున్న జాగ్రత్తలు, ఆంక్షలేమిటి ?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 9:27 AM GMT
భక్తుల దర్శనార్థం కొండపై టిటిడి తీసుకున్న జాగ్రత్తలు, ఆంక్షలేమిటి ?

జూన్ 8వ తేదీ నుంచి దేశంలోని ప్రధాన ఆలయాలన్నింటినీ తెరిచి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనాలు కల్పించవచ్చని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయా ఆలయాల్లో కరోనా వ్యాప్తి జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కలియుగ దైవం..తిరుమల ఏడుకొండలపై కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ నెల 8వ తేదీ నుంచి ఆలయ అధికారులు భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు టిటిడి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.

ఆలయంలో దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. క్యూ లైన్లో నిల్చునే భక్తుల కోసం ఒక్కొక్కరి మధ్య ఆరడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. దర్శనం టికెట్లను అలిపిరి వద్దే ఆన్ లైన్ లో ఇచ్చేలా చర్యలు చేపట్టింది. అలాగే భక్తులు బస చేసేందుకు ఇచ్చే గదులు కూడా ఇద్దరికి మాత్రమే ఒక్క గది ఇచ్చేందుకు టిటిడి సర్వం సిద్ధం చేసింది. ఒక కుటుంబంలో నలుగురుంటే..రెండు గదులు తీసుకోవాలనమాట. అలాగే రోజుకు కేవలం 5 నుంచి 6 వేల మందికి మాత్రమే స్వామివారి దర్శనం కల్పించనుంది టిటిడి.

శ్రీవారి ఆలయంలో దర్శనాలు పునః ప్రారంభంపై టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం కొండపై కరోనా వ్యాప్తి జరుగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను పాటిస్తున్నామన్నారు. దర్శనం ప్రారంభమయ్యే తొలిరోజు భక్తులకు ఏ విధంగా స్వామి దర్శనం కల్పించాలన్నదానిపై ట్రయల్ చేస్తున్నామని, అది సక్సెస్ అయితే దానినే పాటిస్తామన్నారు. ప్రస్తుతం తీసుకున్న జాగ్రత్త చర్యలతో వైరస్ వ్యాప్తి జరగకుండా ఆపలేమనిస్తే..మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కొండపైకి వచ్చే ప్రతి భక్తుడికి థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేస్తామన్నారు.

Next Story