ఏపీలో మరో అమానుష ఘటన.. పెన్నా తీరంతో జేసీబీతో కొవిడ్ మృతుల అంత్యక్రియలు
By తోట వంశీ కుమార్ Published on 10 July 2020 5:08 PM ISTఆంధ్రప్రదేశ్‌లో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. శ్రీకాకుళం జిల్లాలో కరోనా మృతదేహాలను జేసీబీ, ట్రాక్టర్లలో తరలించడంపై ప్రభుత్వం ఇటీవల సీరియస్ అయినప్పటికి.. మున్సిపల్ సిబ్బంది తీరు మారడం లేదు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి మృతదేహాలను తాకేందుకు అధికారులు సైతం ఇష్టపడడకనోవడంతో వాటిని జేసీబీలతో తరలించి ఖననం చేసి చేతులు దులుపుకుంటున్నారు.
నెల్లూరు జిల్లా పెన్నానది ఒడ్డున మృతదేహాలను వ్యాన్ నుంచి కిందకు దించి వాటిని జేసీబీలోకి విసిరేశారు. తర్వాత జేసీబీ సాయంతో గోతిలోకి విసిరేశారు. ఈ సీన్ మొత్తాన్ని రోడ్డుపై వెలుతున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ అమానుషం బయటపడింది. కాగా.. నది ఒడ్డున ఖననం చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.
కాగా.. ఈఘటనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు స్పందించారు. ‘‘ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయి. జగన్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలి. కుటుంబ సభ్యులకు అంతిమ సంస్కారాలు ఘనంగా జరగాలని కోరుకునే ఆత్మీయులకు ఇది బాధ కలిగించే అంశం’’ ట్వీట్ చేశారు.
ఈ వార్త తెలియగానే ప్రభుత్వం సీరియస్ అయింది. ఇందులో బాధ్యులను తేల్చేందుకు సమగ్ర విచారణకు అదేశించింది. నెల్లూరు ఆర్డీవో హుస్సేనా సాహెబ్ ను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించింది. ఘటనపై సమగ్రంగా విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ ఇవాళ ఆదేశాలు ఇచ్చారు.