ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా

By సుభాష్  Published on  10 July 2020 10:40 AM GMT
ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా

ఏపీలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏమాత్రం తగ్గడం లేదు. పుట్టిన పిల్లల వృద్దుల వరకు, అలాగే ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఇలా ఏ ఒక్కరిని వదలడంలేదు. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న అతనికి పరీక్షలు నిర్వహించగా, ఈ విషయం బయటకు వచ్చింది. వెంటనే అతన్ని తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అలాగే గన్‌మెన్‌ తో కాంటాక్ట్‌ ఉన్న అందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, గన్‌మెన్‌ కరోనా సోకడంతో ఎమ్మెల్యే రోజా స్పందించారు. తన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మా ఫ్యామిలీ సేఫ్‌గా ఉందని పేర్కొన్నారు. ఇక కరోనా బారిన పడిన వ్యక్తి గత 18 రోజులుగా విధులకు రావడం లేదని తెలిపారు.

ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య ఎక్కువైపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించగా, 1608 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,422కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రం కావడంతో ప్రభుత్వం కూడా వేగవంతంగా చర్యలు చేపడుతోంది. కరోనా పరీక్షల్లో సైతం రికార్డు సాధిస్తోంది. పరీక్షల సంఖ్య పెంచుతూ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం.

Next Story