హైదరాబాద్‌లోని ఆ ప్రాంతాల్లో రామ్‌దేవ్ బాబా కొరోనిల్‌కు భారీ డిమాండ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 July 2020 11:28 AM GMT
హైదరాబాద్‌లోని ఆ ప్రాంతాల్లో రామ్‌దేవ్ బాబా కొరోనిల్‌కు భారీ డిమాండ్..!

హైదరాబాద్: బాబా రామ్‌దేవ్ కొరోనిల్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందో లేదో తెలియదు కానీ.. ఈ పతంజలి ఆయుర్వేద మందును అమ్మడం ద్వారా కొందరు విపరీతమైన లాభాలను ఆర్జిస్తూ ఉన్నారు. తెలంగాణలోని ఓల్డ్ సిటీకి చెందిన వ్యాపారుల కుటుంబాలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే..! దీంతో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు పెద్ద ఎత్తున పతంజలి ఆయుర్వేద ప్రోడక్ట్ అయిన కొరోనిల్ ను భారీగా కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా 545 రూపాయల విలువైన కొరోనిల్ కిట్ ను 1800 రూపాయలకు అక్కడ అమ్ముతూ ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మంగళవారం నాడు హైదరాబాద్ పోలీసులు కరోనా వ్యాక్సిన్లను, మందులను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకోగా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఆభరణాల వ్యాపారుల కుటుంబంలో కరోనా బారిన పడి నలుగురు మరణించడంతో ఆభరణాల వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. ఆభరణాల వ్యాపారుల కుటుంబాల్లో 300 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇటీవల పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు, పెళ్లిళ్లకు సదరు కుటుంబాలు హాజరయ్యాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ వీరు ఈ విషయాన్ని కనీసం పట్టించుకోకుండా ఎంజాయ్ చేశారు. ఆ పార్టీలలో కరోనా పాజిటివ్ వ్యక్తులు చేరడం.. ఒకరి నుండి మరొకరికి వ్యాపించడం జరిగిపోయాయి. ఈ కుటుంబాలలో చాలా మంది రామ్ దేవ్ బాబా ఫాలోవర్లు ఉండడంతో కొరోనిల్ ను విపరీతంగా కొంటున్నారు.

ఈ కుటుంబాలే కాకుండా నగరానికి చెందిన చాలా మంది వ్యాపారులు పెద్ద ఎత్తున కొరోనిల్ కిట్ లను ప్రోడక్ట్ లాంఛ్ రోజునే కొనిపెట్టుకున్నారు. గార్మెంట్ డీలర్లు కూడా కొరోనిల్ ను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్మకానికి పెట్టారు. వీరు భారీగా కొనేయడంతో పతంజలి డీలర్ల వద్ద కనీసం స్టాక్ లేకుండా పోయింది.

1500 రూపాయలు పెట్టి అయిదు కొరోనిల్ కిట్ లను కొన్నానని స్థానిక బిజినెస్ మ్యాన్ తెలిపాడు. తమ కుటుంబాల్లో వందల మంది కరోనా బారిన పడడంతో డిమాండ్ భారీగా ఉందని ఆయన తెలిపాడు. మరో స్థానికుడు కరోనా కారణంగా ఆసుపత్రి పాలివ్వడానికి ముందు కొరోనిల్ కిట్ ను 1200 రూపాయలకు కొనుక్కున్నాడట.. అతడి కుటుంబ సభ్యులు కూడా ఆ కొరోనిల్ కిట్ లను ఉపయోగిస్తూ ఉన్నారు. తమ కుటుంబంలో కొందరు మరణించారు. దీంతో కరోనా బారిన పడకుండా కొరోనిల్ కిట్లను ఎంత పెట్టి కొనడానికైనా వెనుకాడడం లేదని చెప్పుకొచ్చాడు మరో వ్యక్తి.

Next Story