వామ్మో.. ఈ వైరస్ ఎవ్వరికి అంతుచిక్కట్లే..
By తోట వంశీ కుమార్ Published on 13 April 2020 3:34 PM GMTకరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి లక్షా పదివేల మంది మృత్యువాత పడగా.. 18లక్షలకు పైగా దీని బాధితులు ఉన్నారు. ఈ వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. శాస్త్రవేత్తలకు సైతం అందకుండా పెను సవాలు విసురుతోంది. ఈ మహమ్మారి కట్టడికి చాలా దేశాలు లాక్‌డౌన్ లు ప్రటించాయి. చైనాలో మొన్నటి వరకు విజృంభించిన ఈ మహమ్మారి కాస్త తగ్గినట్లే అనిపించినా.. ఒకే రోజు మళ్లీ 150 కేసులు నమోదయ్యాయి.
ఈ వైరస్ ఎవ్వరికి అంతుచిక్కడం లేదు. మొదటి సారి పరీక్ష చేస్తే నెగిటివ్.. రెండో సారి చేస్తే పాజిటివ్.. మరో సారి చేస్తే నెగిటివ్ అని తేలుతుండడం చాలా ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ వ్యాధి తగ్గినట్టే తగ్గి మళ్లీ పొడచూపటంతో ఇద్దరు కరోనా బాధితులు డిశ్చార్జి అయిన కొద్ది గంటల్లోనే మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన నొయిడాలో వెలుగుచూసింది.
కరోనా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు నోయిడా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. వారు కోలుకున్న అనంతరం.. నిబంధనల ప్రకారం రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ రెండు ఫలితాల్లో వారికి నెగిటివ్ వచ్చింది. దీంతో వారిని శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసేటప్పుడు వారి నుంచి మరో సారి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. మూడో సారి నిర్వహించిన పరీక్షల్లో వారికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో వెంటనే వైద్యులు వారిద్దరిని తిరిగి ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
దీనిపై పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధా నగర్‌లో ఇప్పటి వరకు 64 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 13 మంది చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి వెళ్లారు.