దడ పుట్టించే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ గురించి చెప్పిన హాంగ్ కాంగ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Aug 2020 6:10 AM GMTకరోనా వైరస్ నుండి కోలుకున్న కొన్ని నెలలకే మళ్లీ కరోనా వైరస్ సోకిన ఘటన హాంగ్ కాంగ్ లో చోటుచేసుకుంది. ఏప్రిల్ నెలలో కరోనా వైరస్ నుండి కోలుకున్న 33 సంవత్సరాల వ్యక్తికి మళ్లీ కరోనా సోకింది. యూరప్ నుండి హాంగ్ కాంగ్ కు వచ్చిన సదరు వ్యక్తిని ఎయిర్ పోర్టులో పరిశీలించగా SARS-CoV-2 రెండో సారి సోకిందని గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ కు చెందిన రీసెర్చర్లు ఈ కేసుపై పరిశీలన మొదలుపెట్టారు. ఐటీ డిపార్ట్మెంట్ కు చెందిన ఆ వ్యక్తికి రెండోసారి కరోనా సోకిన సమయంలో ఎటువంటి లక్షణాలు కూడా లేవని చెబుతున్నారు.
మనుషుల్లో కరోనా వైరస్ రెండో సారి సోకే అవకాశం ఉందని వారి రీసర్చ్ పేపర్ల ద్వారా చెబుతున్నారు. మొదటి సారి కరోనా వైరస్ సదరు వ్యక్తికి సోకినప్పుడు కేవలం జలుబు మాత్రమే వచ్చిందని.. ఇప్పుడు ఎటువంటి లక్షణం కూడా లేదని స్పష్టం చేశారు. ఒక్కసారి కరోనా సోకితే మరోసారి కరోనా సోకకపోవచ్చు అనుకోకూడదని.. ఇంకా చాలా మందికి రెండో సారి కూడా కరోనా సోకే అవకాశం ఉందని చెబుతున్నారు.
రీసెర్చర్లు చెప్పిన స్టడీని జర్నల్ క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ యాక్సెప్ట్ చేసింది. ఇంకా పబ్లిష్ చేయలేదు. పూర్తీ రిజల్ట్స్ వచ్చే వరకూ పబ్లిష్ చేయకూడదని కొందరు తెలిపారు.
రెండోసారి కూడా కరోనా వైరస్ సోకే అవకాశం ఉండడంతో ఎన్ని రోజుల పాటూ శరీరంలో యాంటీ బాడీస్ పని చేస్తూ ఉంటాయి.. వ్యాక్సిన్ పని తీరు వంటి వాటిపై కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. దీన్ని బట్టే ఉద్యోగాలు, స్కూల్స్, పలు చోట్లకు ప్రజలు వెళ్లడం వంటివి ఆధారపడి ఉన్నాయి. రెండోసారి కరోనా సోకినా మనిషి లోని యాంటీ బాడీలు కరోనాను తరిమేయగలవా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది.
కరోనా వైరస్ నుండి కోలుకున్న తర్వాత.. కొద్ది నెలలకే కరోనా వైరస్ మరోసారి సోకడం ఇదేనని.. అతడి మీద డాక్యుమెంటేషన్స్ చేస్తున్నామని రీసెర్చర్లు తెలిపారు. కోవిద్-19 రెండో సారి సోకిన వారిని కనుక్కోవడం చాలా అరుదని రీసెర్చర్లు చెబుతున్నారు. రెండోసారి కోవిద్-19 సోకిన సమయంలో అతడిలో ఎటువంటి లక్షణాలు చూపించడం లేదు. అతడి లోని మెమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ కోవిద్-19 లక్షణాలు బయటకు రాకుండా చేసుండొచ్చని చెబుతున్నారు.
రెండోసారి కరోనా వైరస్ సోకిన వ్యక్తికి ఏమీ అవ్వకున్నా.. కరోనా వైరస్ సోకని వ్యక్తికి అంటుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా వైరస్ రెండో సారి సోకడం వలన ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా చూపించ వచ్చని చెబుతున్నారు. కొందరిలో రోగ నిరోధక శక్తి తొందరగా తగ్గిపోవచ్చని.. మరికొందరికి రెండేళ్ల వరకూ తగ్గకపోవచ్చని చెబుతూ ఉన్నారు. కరోనా మొదటిసారి సోకిన కొన్ని నెలలకే రెండోసారి మళ్లీ సోకడంతో పలు ప్రశ్నలు వైద్యులు, శాస్త్రవేత్తల ముందు ఉన్నాయి.