కరోనా దెబ్బకు ఆ సంపన్న దేశం 70 ఏళ్లు వెనక్కి వెళ్లిందట.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Aug 2020 5:55 AM GMT
కరోనా దెబ్బకు ఆ సంపన్న దేశం 70 ఏళ్లు వెనక్కి వెళ్లిందట.!

ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థ.. బుల్లిదేశమే అయినా.. సంపన్న దేశంగా పేరున్న జపాన్ కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఆ దేశం ఆర్థికంగా 70 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయినట్లుగా అంచనా వేస్తున్నారు. వైరస్ కారణంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న క్షీణత కారణంగా జపాన్ కిందా మీదా పడుతోంది. తాజాగా ప్రభుత్వం దీనికి సంబంధించిన గణాంకాల్ని విడుదల చేసింది.

కరోనా నేపథ్యంలో జపాన్ లో వాణిజ్యం తీవ్ర ప్రభావానికి గురైంది. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం క్షీణించినట్లుగా లెక్క కట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఇదే అతి పెద్ద క్షీణతగా జపాన్ మీడియా చెబుతోంది. దీనికి ముందు అతి పెద్ద ఆర్థిక క్షీణత 2009లో నమోదైంది. ఆ మాటకు వస్తే.. ఆ సమయంలో యావత్ ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవటం తెలిసిందే.

ఇప్పటికే పలు సవాళ్లతో బండి లాగిస్తున్న ఈ సంపన్న దేశానికి కరోనా మింగుడుపడనిదిగా మారింది. గడిచిన ఏడాదిగా తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతోంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన కరోనా దెబ్బకు.. ఆర్థిక వ్యవస్థ భారీగా ప్రభావితమైంది. తాజాగా పేర్కొన్న గణాంకాల ప్రకారం జపాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొని ఉంది. వరుసగా రెండుసార్లు జీడీపీ క్షీణించిందని చెబుతున్నారు. దీనికి తోడు.. జపాన్ వార్షిక ఎగుమతులు 56 శాతం మేర తగ్గిపోవటం ఆ దేశాన్ని ఇబ్బంది పెడుతోంది. చైనాతో పోలిస్తే.. ధరలు ఎక్కువగా ఉండటం.. జపాన్ మార్కెట్ ను దారుణంగా దెబ్బ తీసిందన్న విషయం తెలిసిందే.

Next Story