ఇటీవలే చైనా నుంచి చెన్నైకి వచ్చిన ఒక 42 ఏళ్ల వ్యక్తి మధురైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీనిని కోవిడ్-19 (కరోనా వైరస్) కేసుగా భావిస్తున్నారు. ఒక వేళ కరోనా అని ధ్రువీకరిస్తే మన దేశంలో ఇది తొలి కరోనా మృతిగా పరిగణించాల్సి ఉంటుంది.

మధురైకి చెందిన శక్తికుమార్ చైనాలో ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఇటీవలే పచ్చకామెర్లు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం చైనా నుంచి మధురైకి వచ్చాడు. అక్కడ చికిత్స చేయించుకున్నాడు. ఆ తరువాత రెస్టారెంట్ నడిపేందుకు మనుషులు లేనందువల్ల మళ్లీ చైనాకు వెళ్లిపోయాడు. కానీ అక్కడకి వెళ్ళాక అతని ఆరోగ్యం బాగా క్షీణించడంతో మళ్లీ తిరిగి మధురైకి వచ్చేశాడు. గత శుక్రవారం అతడిని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇతడు సోమవారం రాత్రి మరణించాడు. ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు ఇతనికి కరోనా వైరస్ కూడా ఉండి ఉండవచ్చునని భావిస్తున్నారు. దీంతో సాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పంపించారు. ఆయన ఆరోగ్యం ముందునుంచే బాగా లేకపోయినా కరోనా వైరస్ వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోయి మృతి చెంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

అయితే ఇన్ని రకాలుగా చైనా నుంచి వచ్చినవారిని పరీక్షిస్తున్నా శక్తి కుమార్ ఎలా నిఘా బారిన పడకుండా ఇంటికి చేరుకున్నాడన్నది పెద్ద ప్రశ్న. అయితే తనకు పచ్చకామెర్లు ఉన్నాయని అతను చెప్పి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇప్పుడు అతను చనిపోయిన వార్త బయటకు రావడంతో ఆరోగ్య శాఖ అధికారులు అతని సొంత గ్రామం కొత్తై మంగళంకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో త్రిపురా రాష్ట్రంలో ఈ వైరస్‌కు ఒకరు మృతి చెందినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఒక వేళ అది నిజమై.. ఇది కూడా నిజమైతే ఇది రెండో మృతిగా భావించాల్సి ఉంటుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.