కరోనాపై తెలంగాణ మంత్రి ఈటల 

కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఆయనతో ప్రత్యేక్ష, పరోక్ష సంబంధాలున్న 45 మందిని ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించామని ఈటల చెప్పారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని.. రిపోర్ట్స్‌ కోసం వేచి చూస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ సోకిన వారిలో మూడు శాతం మందే చనిపోయారని, ఎవరికి వారు నియంత్రించుకుంటే కరోనాని తగ్గించవచ్చన్నారు. ప్రజలు ఎవరూ కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. గాలి ద్వారా కరోనా వైరస్‌ సోకదని, కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి తుంపర్లతోనే వైరస్ సోకే అవకాశం ఉందని చెప్పారు. తుమ్ము లేదా దగ్గినప్పుడు రుమాలు అడ్డుపెట్టుకోవాలన్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రజలకు ఎవరికీ కరోనా రాలేదన్నారు. కరోనా కోసం రూ.100 కోట్ల నిధులను కేటాయించామన్నారు. గాంధీ, మిలిటరీ, చెస్ట్‌, వికారాబాద్‌లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశామని మంత్రి ఈటల తెలిపారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో కలిపి 3 వేల పడకలు సిద్ధంగా ఉంచామన్నారు.

కరోనాపై ఏపీ మంత్రి ఆళ్ల నాని..

కరోనా వైరస్‌ వ్యాప్తిపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష చేశారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 8 ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామన్నారు. కరోనానని సులువుగా నివారించవచ్చని, కరోనా వైరస్‌ మనల్ని చంపదని అన్నారు. ఆరోగ్యంగా ఉంటే కరోనా దరిచేరదని ఆళ్ల నాని తెలిపారు. ముందు జాగత్ర చర్యగా ఐసోలేషన్‌ రూమ్‌లను సైతం ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ వస్తే వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. వైద్యులను, మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు. కరోనాపై ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆళ్ల నాని చెప్పారు. షేక్‌హ్యాండ్‌ చేయకుంటే వైరస్‌ అంటుకోదన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.