వాహనదారులకు షాకిచ్చిన ప్రభుత్వం.. కొత్తగా కరోనా టాక్స్‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2020 8:22 AM GMT
వాహనదారులకు షాకిచ్చిన ప్రభుత్వం.. కొత్తగా కరోనా టాక్స్‌..!

మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్లు అన్న చందంగా తయారైంది వాహన దారుల పరిస్థితి. కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయి.. జీతాల్లో కోతలతో ఇబ్బందులు పడుతున్న సగటు జీవిపై మరో బండ పడింది. వరుసగా ఏడో రోజు కూడా పెట్రోలు, డీజిల్‌ ధర పెరిగింది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా టాక్స్ పేరుతో వాహన దారులపై మరింత భారం మోపేందుకు సిద్ధమైంది. ఉన్న టాక్సులు చాలవు అన్నట్లు పెట్రోల్‌, డీజీల్‌పై లీటరుకు రూపాయి చొప్పున కరోనా టాక్స్‌ విధించింది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది.

కరోనా ట్యాక్స్‌తో కలుపుకుని రాష్ట్రంలో పెట్రోలు ధర లీటరు రూ. 82.64కు పెరగ్గా, డీజిల్ ధర రూ. 73.14కు చేరుకుంది. ఈ కరోనా ట్యాక్స్‌తో ప్రభుత్వానికి పెట్రోలుపై అదనంగా రూ.200కోట్లు, డీజిల్‌ పై రూ.370కోట్లు ఆదాయం రానుంది. అసలే లాక్‌డౌన్‌, కరోనా ముప్పుతో ఇబ్బంది పడుతుంటే.. మధ్యలో ఈ టాక్స్‌ గోలేమిటని మండిపడుతున్నారు. ఇలా టాక్స్‌లు పెంచుకుంటూ పోతుంటే.. ఎలా బతకాలో తెలియడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story