క్రికెట్‌లో కరోనా సబ్‌స్టిట్యూట్..!
By తోట వంశీ కుమార్ Published on 31 May 2020 6:12 PM ISTక్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఎవరు ఆటగాడు గాయపడితే.. అతడి స్థానంలో సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ వచ్చి ఫీల్డింగ్ చేయటాన్ని ఎప్పటి నుంచో చూస్తున్నాం. బంతి హెల్మెట్ ను తాకి బ్యాట్స్‌మెన్ గాయపడితే.. అతడి స్థానంలో వేరే బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ చేసే కంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనను ఇటీవల ఐసీసీ తీసుకుంది. ఈ నిబంధనను మొదటి సారి యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా ఉపయోగించుకుంది. యాషెస్ రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడడంతో మార్కస్ లబుషేన్ అతడి స్థానంలో బ్యాటింగ్ చేశాడు.
కరోనా వైరస్ మన జీవితాల్లో చాలా మార్పులను తీసుకువచ్చింది. భౌతిక దూరం, మాస్కులు అనేవి జీవితంలో భాగం అయిపోయాయి. ఈ మహమ్మారి ముప్పుతో క్రీడా రంగం కుదేలైంది. ఇప్పటికే చాలా టోర్నీలు వాయిదా పడగా.. పలు టోర్నీలు రద్దు అయ్యాయి. చాలా క్రికెట్ బోర్డులు ఆర్థికంగా కుదేలు అయ్యే పరిస్థితులు వచ్చాయి. ఇక కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టగానే ఆటను పునః ప్రారంభించాలనే యోచనలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఉన్నాయి.
తాజాగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఓ ఆలోచనతో ముందుకు వచ్చింది. క్రికెట్‌లో ఏ ఆటగాడికైనా వైరస్ సోకితే.. కొవిడ్ 19 సబ్‌స్టిట్యూట్ ఇవ్వాలని ఈసీబీ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని కోరింది. దీనిపై ఐసీసీ సానుకూలంగా స్పందిస్తుందని ఈసీబీ విశ్వసిస్తోంది. ఒకవేళ ఐసీసీ ఇందుకు అనుమతిస్తే.. ఏ ఆటగాడు అయినా.. కరోనా లక్షణాలతో బాధపడుతుంటే అతని స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవచ్చు.
కరోనా దెబ్బకు క్రికెట్‌లో చాలా మార్పులు రానున్నాయి. ఇప్పటికే బంతిపై ఉమ్మి వేయడాన్ని నిషేదించారు. భౌతిక దూరం తప్పని సరి కావడంతో ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదని ఆయా క్రికెట్ బోర్డులు ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేశాయి. ఉమ్మి వాడకంపై నిషేధం విధించినా.. స్వేదం(చెమట) వాడేందుకు అనుమతి ఇచ్చింది ఐసీసీ. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా చేస్తే బౌలర్లకు కష్టకాలం తప్పదని పలువురు మాజీలు అంటున్నారు. బాల్ ట్యాంపరింగ్‌కు చట్టబద్దత కల్పించాలని పలువురు కోరినా దీనిపై ఐసీసీ ఇంతవరకు స్పందించలేదు.
]