ఖేల్ ర‌త్నకు హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 May 2020 3:55 PM GMT
ఖేల్ ర‌త్నకు హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌

ప్ర‌తిష్టాత్మ‌క రాజీవ్‌గాంధీ ఖేల్‌ర‌త్న అవార్డుకు టీమ్ఇండియా వ‌న్డే టీమ్ వైస్ కెప్టెన్‌, ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ పేరును నామినేట్ చేసిన‌ట్లు బీసీసీఐ(భార‌త క్రికెట్ నియంత్ర‌ణ బోర్డు) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. భార‌త సీనియ‌ర్ పేస‌ర్ ఇషాంత్ శ‌ర్మ‌, మ‌రో ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌, మ‌హిళా క్రికెట‌ర్ దీప్తి శ‌ర్మ‌ను అర్జున అవార్డుల‌కు నామినేట్ చేసిన‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 2020 ఏడాదికి గాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ‌కు వీరి పేర్ల‌ను పంపింది.

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ 2016 జనవరి 1 నుండి 2019 డిసెంబర్ 31 వరకు పరిశీలన కాలంతో సంబంధిత అవార్డులకు ఆహ్వానాలను కోరింది.

ఈ సమ‌యంలో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ప్ర‌ద‌ర్శ‌న అద్భుతం. 2019 ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ ప్ర‌ద‌ర్శ‌న అమోఘం. ఆ టోర్నీలో ఏకంగా ఐదు శ‌త‌కాలు బాదేశాడు రోహిత్ శ‌ర్మ‌. 2017 నుంచి వన్డేల్లో​ ఏకంగా 18 శతకాలు నమోదు చేయగా, మొత్తం 28 శతకాలతో వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. టీ20ల్లో ఏకంగా నాలుగు శ‌త‌కాలు బాదిన హిట్ మ్యాన్ 8 వ‌న్డేల్లో 150 పైగా ప‌రుగులు సాధించాడు.

ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ అరంగ్రేట టెస్టులో అత్యంత వేగ‌వంత‌మైన టెస్టు సెంచ‌రీ సాధించాడు. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫిలో రెండు సార్లు అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా నిలిచి గోల్డెన్ బ్యాట్‌ను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో పేసర్‌ ఇషాంత్‌ శర్మ విజృంభిస్తూ.. ఎంతో కాలంగా జట్టుకు సేవలందిస్తున్నాడు. మ‌హిళ‌ల క్రికెట్‌లో గ‌త కొంత కాలంగా భార‌త మ‌హిళా క్రికెట‌ర్ దీప్తి శ‌ర్మ ఆల్ రౌండ‌ర్‌గా కీల‌క పాత్ర పోషిస్తూ జ‌ట్టు విజ‌యాల్లో పాలు పంచుకుంటోంది.

Next Story